ఇంటర్ లో పాస్ (35 %)చాలు ఎంసెట్లో సీటు పొందవచ్చు


 

ఎంసెట్ అభ్యర్థులకు తెలంగాణ విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎంసెట్‌లో ఇంటర్మీడియెట్‌ లేదా తత్సమాన పరీక్షలో కనీస మార్కుల నిబంధన నుంచి అభ్యర్థులకు మినహాయింపునిచ్చింది. ఈసారి ఇంటర్మీడియట్ లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం నిబంధన అవసరం లేదు. కేవలం వాళ్లు పాస్ మార్కులు తెచ్చుకున్నా.. (35 శాతం) సరిపోతుంది. 35 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు.. బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులలో సీట్లు పొందేందుకు పోటీ పడొచ్చని రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి చిత్రా రామచంద్రన్ గురువారం అధికారిక జీవోను విడుదల జారీ చేశారు. కోవిడ్‌-19 నేపథ్యంలో ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులను 35 శాతం మార్కులతో రాష్ట్ర ప్రభుత్వం పాస్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో 35 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంసెట్‌లో ర్యాంకులు పొందలేకపోయారు. వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వమే ఇంటర్‌లో ఉత్తీర్ణులుగా ప్రకటించి ఎంసెట్‌ ర్యాంకు ర్యాంకు కేటాయించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ నిబంధనకు మినహాయింపు ఇచ్చారు. ఇంజినీరింగ్‌ తుదివిడత కౌన్సెలింగ్‌ను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇంటర్ లో కనీస మార్కులతో ఉత్తీర్ణులైతే వారిని కూడా కౌన్సెలింగ్ కు అనుమతిస్తమాని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధన ఈ ఒక్క సంవత్సరానికే వర్తిస్తుందని, తర్వాతి విద్యా సంవత్సరం నుంచి అంతకుముందు లాగే కొనసాగుతుంది విద్యాశాఖ తెలిపింది. రేపటి నుంచి వెబ్‌ఆప్షన్ల నమోదు ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్‌ ప్రవేశాల తుదివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ శనివారం నుంచి మొదలవనుంది. ఈ మేరకు ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ గురువారం ఒక ప్రకటన విడుదలలో ఈ విషయాన్ని తెలిపారు. ఈనెల 31న ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉండడంతోపాటు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుక్‌ చేసుకోవటానికి అవకాశముంటుందని ఆయన పేర్కొన్నారు. ఎంసెట్‌లో అర్హత పొందిన అభ్యర్థులూ హాజరుకావొచ్చని సూచించారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న అభ్యర్థులకు వచ్చేనెల ఒకటిన ధువ్రపత్రాల పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి వచ్చేనెల 2 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసేందుకు అవకాశముందని వివరించారు. వచ్చేనెల ఆప్షన్లను ఫ్రీజింగ్‌ చేస్తామని తెలిపారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ సొసైటీ) ద్వారా 35 శాతం మార్కులతో ఇంటర్ లో ఉత్తీర్ణులై నీట్, ఎంసెట్, లాసెట్ తదితర కౌన్సెలింగ్ లకు అర్హత సాధించిన విద్యార్థులకు తగినంత కనీస మార్కుల శాతం ఉన్నట్టుగానే ఈ విద్యాసంవత్సరం కూడా భావిస్తామని విద్యాశాఖ తెలిపింది. లాసెట్ విషయంలో విద్యాశాఖ తర్జనభర్జన పడుతున్నది. లాసెట్ లో అయిదేళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు ఇంటర్ విద్యార్థులు కూడా అర్హులు. ఆ కోర్సులో ప్రవేశించాలంటే ఓసీలకు 45 శాతం, ఓబీసీ లకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులు రావాలి. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్ అయినవారికి ఆ సబ్జెక్టులలో 35 శాతం మార్కులు వేసి పాస్ చేయించిన విషయం తెలిసిందే. దానివల్ల తాము లాసెట్ కౌన్సెలింగ్ లో పాల్గొనే అవకాశం కోల్పోతామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.