40,000 దిగువకు సెన్సెక్స్‌; 1,066 పాయింట్లు డౌన్‌

 


 సూచీల పదిరోజుల సుదీర్ఘ ర్యాలీకి గురువారం బ్రేక్‌ పడింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. అలాగే మార్కెట్‌ 10 రోజుల ర్యాలీతో ఆయా షేర్ల వ్యాల్యుయేషన్లు భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే మొగ్గుచూపారు. ట్రేడింగ్‌ ప్రారంభంలో మొదలైన అమ్మకాల సునామీ మార్కెట్‌ ముగిసేవరకు కొనసాగింది. ఫలితంగా సెన్సెక్స్‌ 1,066 పాయింట్లను నష్టపోయి 40,000 దిగువన 39,728 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 291 పాయింట్లను కోల్పోయి 11,680 వద్ద ముగిసింది. అన్ని రంగాలకు షేర్లలో విపరీతమైన విక్రయాలు జరిగాయి. సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో ఒక్క ఏషియన్‌ పెయింట్స్‌(0.32 శాతం)మాత్రమే లాభపడింది. ఇక నిఫ్టీలోని 50 షేర్లలో 3 షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. గురువారం ఎఫ్‌ఐఐలు రూ.604 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.808 కోట్ల షేర్లను అమ్మారు. బీఎస్‌ఈ ఎక్సే్చంజ్‌లో మిడ్‌క్యాప్‌ ఇండెక్స్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.75 శాతం నష్టాన్ని చవిచూశాయి.