ఆన్‌లైన్‌లో అయితే రూ.50 డిస్కౌంట్‌  సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ జారీ ధరను ఆర్‌బీఐ నిర్ణయించింది. ఈ బాండ్‌ జారీ ధరను రూ. 5,051(ఒక గ్రాముకు)గా ఖరారు చేసినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2020–21 సిరీస్‌ –7 ఈ నెల 12న మొదలై 16న ముగుస్తుంది. 1 గ్రాము, 1గ్రాము గుణిజాల డినామినేషన్లలో ఈ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఈ గోల్డ్‌బాండ్ల కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తర్వాత ఈ బాండ్లను విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ బాండ్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేవారికి, అలాగే బాండ్ల సొమ్ములను డిజిటల్‌ విధానంలో చెల్లించేవారికి రూ.50 డిస్కౌంట్‌ లభిస్తుంది. కాగా ఆరో సిరీస్‌ గోల్డ్‌ బాండ్ల జారీ ధర రూ.5,117గా ఉంది. నివాసిత వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబం, ట్రస్ట్‌లు, యూనివర్శిటీలు,చారిటబుల్‌ ట్రస్ట్‌లను మాత్రమే ఈ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయడానికి అనుమతిస్తున్నారు. బ్యాంక్‌లు, కొన్ని అధీకృత పోస్ట్‌ ఆఫీసులు, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు ఈ బాండ్లను విక్రయిస్తాయి.