ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ గెలుపు

 


 ఢిల్లీ ఆటకు పరుగుల బాట చూపించిన శిఖర్‌ ధావన్‌ అజేయ శతకం... సుడి‘గేల్‌’, పూరన్‌ మెరుపుల ముందు చిన్నబోయింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 5 వికెట్ల తేడాతో ఢిల్లీపై నెగ్గింది. టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శిఖర్‌ ధావన్‌ (61 బంతుల్లో 106 నాటౌట్‌) ఒక్కడే చెలరేగాడు. వీరోచిత శతకంతో ఆఖరి దాకా స్కోరుబోర్డును నడిపించాడు. తర్వాత కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 19 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసి గెలిచింది. పూరన్‌ (28 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), గేల్‌ (23 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. ఆడింది ఒక్కడే... ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ఆరంభం నుంచి పరుగెత్తించింది... మెరిపించింది... నడిపించింది... ధావన్‌ ఒక్కడే! పృథ్వీ షాతో ఆట ఆరంభించిన ఈ ఓపెనరే క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌కు ఆది, అంతాలయ్యాడు. ఇన్నింగ్స్‌ రెండో బంతి నుంచి ధావన్‌ దంచుడు ఫోర్‌తో మొదలైంది. ఆఖరి ఓవర్‌ నాలుగో బంతికి ఓ పరుగు దాకా సాగింది. ఈ మధ్యలో 61 బంతులు అంటే సగం ఓవర్లు ధావన్‌ ఆడాడు. 12 బౌండరీలు, 3 సిక్సర్లు బాదాడు. ఇక మిగతావారి గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ఓపెనింగ్‌ సహచరుడు పృథ్వీ షా (7), కెప్టెన్‌ అయ్యర్‌ (14), పంత్‌ (14), స్టొయినిస్‌ (9), హెట్‌మైర్‌ (10) అందరూ ప్రత్యర్థి బౌలింగ్‌కు తలవంచారు. మ్యాక్స్‌వెల్‌ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతిని ఎదుర్కొన్న∙ధావన్‌ బౌండరీతో ఆట మొదలుపెట్టాడు. ఐదో బంతికి భారీ సిక్సర్‌ బాదాడు. దీంతో ఓవర్లో 13 పరుగులు రాగా... డజను పరుగులు ధావన్‌వే! ఢిల్లీ ఇన్నింగ్స్‌ ముగిసేదాకా అతని జోరులో, జట్టు స్కోరులో ఇదే కనబడింది. 28 బంతుల్లో ఫిఫ్టీ (8 ఫోర్లు, 1 సిక్స్‌) పూర్తి చేసుకున్న ధావన్‌... 57 బంతుల్లోనే ‘శత’క్కొట్టేశాడు. 5.3 ఓవర్లో అతని పరుగుతోనే జట్టు స్కోరు 50కి చేరింది. కాసేపయ్యాక 13వ ఓవర్లో ధావన్‌ సిక్సర్‌తో ఢిల్లీ 100 పరుగులను అధిగమించింది. చివరకు 19వ ఓవర్లో అతను తీసిన 2 పరుగులతో అతని శతకం, జట్టు స్కోరు 150 పరుగులు పూర్తయ్యాయి. ఇలా క్యాపిటల్స్‌ జట్టు ప్రతి 50 పరుగుల మజిలీని ధావన్‌ బ్యాట్‌తోనే చేరింది.