డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ప్రతిపాదిస్తున్న ప్యాకేజీకంటే మరింత అధికంగా స్టిములస్ చర్యలకు సిద్ధమంటూ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడంతో వారాంతాన బులియన్ మార్కెట్లకు జోష్ వచ్చింది. అధ్యక్ష ఎన్నికలయ్యే వరకూ డెమొక్రాట్లతో సహాయక ప్యాకేజీలపై చర్చలు నిర్వహించేదిలేదంటూ వారం మొదట్లో ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలహీనపడగా.. తాజా పెట్టుబడులపై అంచనాలతో పసిడి, వెండి దూసుకెళ్లాయి. ఫలితంగా న్యూయార్క్ కామెక్స్లోనూ, దేశీయంగా ఎంసీఎక్స్లోనూ ధరలు జంప్చేశాయి. పసిడి 1912 డాలర్లను అధిగమించడంతో తదుపరి 1939 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.