629 పాయింట్లు అప్‌- 38,697కు సెన్సెక్స్‌


రెండు రోజుల కన్సాలిడేషన్‌ నుంచి బయటపడుతూ దేశీ స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేశాయి. సెన్సెక్స్‌ 629 పాయింట్లు దూసుకెళ్లి 38,697 వద్ద నిలవగా.. నిఫ్టీ 170 పాయింట్లు జమ చేసుకుని 11,417 వద్ద ముగిసింది. సానుకూల ప్రపంచ సంకేతాలకుతోడు జీడీపీకి దన్నుగా నిలుస్తామంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇచ్చిన భరోసా నేపథ్యంలో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడ్డారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,739వరకూ జంప్‌చేయగా.. నిఫ్టీ 11,429 వరకూ ఎగసింది. ఇండస్‌ఇండ్‌ జోరు ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 4.2 శాతం, మీడియా 2.8 శాతం చొప్పున పురోగమించాయి. ఈ బాటలో రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ 1.8-0.6 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌ 12.5 శాతం దూసుకెళ్లగా.. యాక్సిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఆటో, ఐసీఐసీఐ, టెక్‌ మహీంద్రా, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఫిన్‌, కొటక్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, టీసీఎస్‌, శ్రీ సిమెంట్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, సన్‌ ఫార్మా 5-1.5 శాతం మధ్య లాభపడ్డాయి. కేవలం డాక్టర్‌ రెడ్డీస్‌, ఓఎన్‌జీసీ, ఐటీసీ, ఎన్‌టీపీసీ, టైటన్‌, హిందాల్కో అదికూడా 1.3-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి.