కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై 69 పరుగులతో సన్‌రైజర్స్‌ ఘనవిజయం

 


 సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 69 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను చిత్తుగా ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బెయిర్‌స్టో (55 బంతుల్లో 97; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... వార్నర్‌ (40 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా అర్ధసెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 91 బంతుల్లో 160 పరుగులు జోడించారు. అనంతరం పంజాబ్‌ 16.5 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. నికోలస్‌ పూరన్‌ (37 బంతుల్లో 77; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. 12 పరుగులకే 3 వికెట్లు తీసి రషీద్‌ ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. మరో 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్‌ ముగియడం పంజాబ్‌ వైఫల్యాన్ని సూచిస్తోంది.