ఈ ఏడాది వృద్ధి రేటు 9.6 శాతం క్షీణత : ప్రపంచ బ్యాంక్‌

 


 ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌-19 ప్రభావాన్ని నిరోధించేందుకు భారత్‌ కీలక సంస్కరణలను కొనసాగించాలని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక పేర్కొంది. కరోనా వైరస్‌ విధ్వంసంతో దక్షిణాసియా తీవ్ర మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందని, 2020లో ఈ ప్రాంత వృద్ధి 7.7 శాతం తగ్గుతుందని అంచనా వేసింది. ఇక దక్షిణాసియాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మార్చితో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.6 శాతం క్షీణిస్తుందని పేర్కొంది. అయితే 2022 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ తిరిగి పుంజుకుని 5.4 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక వెల్లడించింది. కోవిడ్‌-19 నియంత్రణలు 2022 నాటికి పూర్తిగా తొలగిపోతాయని అంచనా వేసింది. ఇక కోవిడ్‌-19 ప్రభావంతో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతో భారత ఎగుమతులు, దిగుమతులు దెబ్బతింటాయని పేర్కొంది.