రేపటి నుంచి దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు


మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లుపై దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల నుండి నిరసన వ్యక్తం అవుతోందని ఏఐసీసీ సెక్రటరీ బోస్‌రాజు అన్నారు. సంగారెడ్డి పట్టణంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిని పురస్కరించుకుని.. మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేక బిల్లులపై రేపు(శుక్రవారం) కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్త నిరసనలు చేపట్టామని తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు, సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. రేపు సంగారెడ్డిలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డిలు పాల్గొంటారని ఆయన వెల్లడించారు.