సింగరేణి: ఎన్నికల నిర్వహణలో అలసత్వం


సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు గుదిబండై కూర్చున్నాయా..? చుట్టూ అల్లుకున్న విమర్శలు.. వైఫల్యాల నుంచి బయట పడాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందా..? కావాలనే ఎన్నికల నిర్వహణ ప్రక్రియను జాప్యం చేస్తోందా..? అంటే అవుననే అంటున్నారు జాతీయ కార్మిక సంఘాల నేతలు. గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ముగిసి ఆర్నెళ్లు కావస్తున్నా.. ఇప్పటివరకు ఎన్నికల ఘట్టానికి సన్నాహాలు మొదలు పెట్టక పోవడాన్ని దీనికి కారణంగా చూపిస్తున్నారు. ఇప్పుడున్న సమస్యలకు తోడు పాలకులు ఇచ్చిన హామీల వ్యవహారం కూడా “ఎక్కడ వేసిన గొంగలి అక్కడే’ అన్న చందంగా మారడం మరో కారణంగా చెబుతున్నారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ఈ ఏడాది ఏప్రిల్‌ 16 నాటికి ముగిసిపోయింది. గత ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ (తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం) విజయం సాధించిన విషయం తెల్సిందే. కాలపరిమితి ముగిసిన వెంటనే గుర్తింపు సంఘం తప్పుకోవాలి. అదే సమయంలో ఎన్నికల ప్రక్రియ మొదలు కావాలి. ఈ లెక్కన ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌ జారీతోపాటు ఎన్నికల ఘట్టం కూడా పూర్తికావాల్సి ఉంది. కానీ.. ఆరునెలలు గడుస్తున్నా.. ఎన్నికల దిశగా అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. వాస్తవానికి ఏప్రిల్‌ 16కు ముందునుంచే వివిధ ఎన్నికల సన్నాహాలను సింగరేణి యాజమాన్యం చేపట్టాల్సి ఉంది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో యాజమాన్యం ముందుకు రాలేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలకు సుముఖత చూపకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.