మళ్లీ మొదలైంది

 


 కన్నడ యాక్షన్‌ చిత్రం ‘కేజీయఫ్‌ – ఛాప్టర్‌ 1’ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంత అలరించిందో తెలిసిందే. దాంతో ఈ సినిమా రెండో భాగంపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఆ అంచనాలు అందుకునే రీతిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యష్‌ ముఖ్య పాత్రలో ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన చిత్రం ‘కేజీయఫ్‌’ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌). ఈ సినిమా రెండో భాగం ‘ఛాప్టర్‌ 2’ చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయింది. తాజాగా చిత్రీకరణలో జాయిన్‌ అయ్యారు యష్‌. ఈ విషయాన్ని తెలియజేస్తూ – ‘అలల్ని ఆపలేం. కానీ వాటి మీద ఎదురీదడం నేర్చుకోవచ్చు. చిన్న విరామం తర్వాత రాకీ భాయ్‌ ప్రయాణం మళ్లీ మొదలుపెట్టాడు’ అని ట్వీట్‌ చేశారు యష్‌. ఈ సినిమాలో రాకీ భాయ్‌ పాత్రలో ఆయన నటిస్తున్నారు. ప్రకాష్‌ రాజ్, సంజయ్‌ దత్, రవీనా టాండన్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ నెలాఖరుకు సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం.