సాధారణ స్థాయికి చేరుకుంటున్న ప్రయాణాలు

 


 శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలు క్రమంగా సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. లక్షలాది మంది వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణం చేస్తున్నారు. దేశీయ సర్వీసులతో పాటు వివిధ దేశాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాదు.. కోవిడ్‌ కారణంగా ఎయిర్‌పోర్టులో షాపింగ్‌ చేసేందుకు భయపడిన జనం.. ఇప్పుడు సరదాగా షాపింగ్‌ చేస్తున్నారు. కోవిడ్‌ తర్వాత జీవన విధానాన్ని ప్రారంభించారు. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం మార్చి 23 నుంచి మే 25 వరకు లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో అన్ని రకాల జాతీయ, అంతర్జాతీయ విమాన సేవలు నిలిచిపోయాయి. సరుకు రవాణా కార్గో విమానాలు మాత్రమే నడిచాయి. ఆ తరువాత వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు తరలించేందుకు వందేభారత్‌ విమానాలను నడిపారు. ప్రయాణికులు మాత్రం కోవిడ్‌ భయాందోళనలతో రాకపోకలు సాగించారు. మే 25 నుంచి దేశీయ ప్రయాణాలను పునరుద్ధరించారు. మొదట్లో ప్రయాణికుల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. ప్రస్తుతం అన్‌లాక్‌లో భాగంగా అన్ని రకాల ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు పునరుద్ధరించడంతో జనజీవితంలోనూ అనూహ్య మార్పులు వచ్చాయి. కోవిడ్‌కు ముందు ఉన్న పరిస్థితులు నెలకొన్నా యి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ వ్యాపార కార్యకలాపాలు పెరిగినట్లు జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.