గల్ఫ్‌ కార్మికుల దుస్థితి పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ

 

 గల్ఫ్‌ దేశాల్లో వేధింపులకు గురవుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని కార్మికుల దుస్థితిపై తెలంగాణ గల్ఫ్‌ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పట్కూరి బసంత్‌ రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్‌ను విచారించింది. గల్ఫ్‌ కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకోని వారికి సరైన జీతాలు చెల్లించకపోవడంతో పాటు వేధింపులకు గురిచేస్తున్నారని, నకిలీ ఏజెంట్లు గల్ఫ్‌ ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనానికి నివేదించారు. గల్ఫ్‌ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయుల కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని వివరించారు. దేశ ప్రగతికి దోహదం చేస్తున్న గల్ఫ్‌ కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం సమగ్ర విధానం రూపొందించాలని కోరారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ విదేశాల్లో ఉన్న భారతీయుల విషయంలో ఆదేశాలు ఇవ్వలేమని, భిన్నమైన దేశాల్లో భిన్నమైన చట్టాలు ఉండటం వల్ల ఆయా దేశాలకు ఆదేశాలివ్వడం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. పిటిషనర్‌ లేవనెత్తిన సమస్యలను పరిశీలించమని కేంద్ర ప్రభుత్వానికి సూచించగలమని చెప్పారు.