రాజకీయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్త ఒడిదుడుకులు

 


లు రాజకీయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్త ఒడిదుడుకుల్లో ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా, తన సత్తా ఏంటో నిరూపించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పవన్ పని అయిపోయిందని, జనసేన రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమే అని, ఇలా పెద్దఎత్తున ప్రచారం జరిగినా, ప్రత్యర్థులు ఎన్ని రకాలుగా అవహేళనకు గురి చేసినా, పవన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. రాజకీయంగా పై చేయి సాధిస్తూ, తన సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. బిజెపి సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో అయినా భారీ విజయాన్ని నమోదు చేసుకోవాలనే విధంగా పవన్ అడుగులు వేస్తున్నారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా, జనసేన ద్వారా పవన్ విమర్శలు చేస్తూనే వస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా సినిమా షూటింగ్ లలో బిజీగా ఉంటున్నా, పవన్ సోషల్ మీడియా ద్వారా మాత్రమే ఏపీలో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ చేస్తున్నారు.  అయితే అకస్మాత్తుగా ఏపీ తెలంగాణలో ముంచెత్తిన భారీ వరదల కారణంగా, ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఈ వ్యవహారాలపై పవన్ అదేపనిగా ఏపీ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నారు. ఈ విమర్శలతో పార్టీలో కాస్త ఊపు వచ్చినట్టుగా కనిపిస్తుండడంతో, ఈ అంశం ద్వారా జనంలోకి వెళ్లాలని బిజెపికి దగ్గరవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏపీ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో గోదావరి జిల్లాలతో పాటు, కృష్ణ గుంటూరు జిల్లాలో ఇప్పటికే వరద నష్టంపై జనసేన వర్గాల ద్వారా అంచనా వేస్తున్నారు. అలాగే తెలంగాణ లోనూ భారీగా సంభవించిన వరద నష్టం పై ఒక నివేదికను తయారు చేయించి, ఏపీ తెలంగాణ కు సంభవించిన వరద నష్టం పై నివేదిక తీసుకుని కేంద్ర బిజెపి పెద్దలను కలవాలని నిర్ణయించుకున్నారు.  ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలపై ఫిర్యాదు చేసే విధంగా ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏపీ తెలంగాణకు భారీగా వరద సహాయం చేయించి, ఆ క్రెడిట్ మొత్తం జనసేనకు దక్కే విధంగా పవన్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నిర్మల సీతారామన్ తో కలిసి నివేదికను అందించాలని, పవన్ డిసైడ్ అయ్యారట. ఈ మేరకు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే సందర్భంగా ఏపీలో జనసేన, బీజేపీ పొత్తు కు సంబంధించి అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో, ఆ విషయంపై క్లారిటీ తీసుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారు.  కలిసి ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో దానికి సంబంధించిన షెడ్యూల్ ను కూడా పవన్ బిజెపి పెద్దల ముందు పెట్టబోతున్నారట. వరద నివేదికలు పేరుతో ఆయన బిజెపి పెద్దలకు దగ్గరవ్వాలనే విధంగా పవన్ ప్లాన్ చేసుకుంటున్నట్టు గా కనిపిస్తోంది. ఇవన్నీ పక్కనపెడితే వరద నష్టంపై జనసేన నివేదిక ఇచ్చినంత మాత్రాన కేంద్రం స్పందిస్తుందా అనే సన్నాయి నొక్కులు అప్పుడే మొదలయ్యాయి.