ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరిన స్పెయిన్‌ స్టార్‌

  ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రాఫెల్‌ నాదల్‌ విజయ యాత్ర కొనసాగుతోంది. టైటిల్‌ సాధించే లక్ష్యంతో బరిలోకి దిగిన అతను ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన సెమీస్‌లో రెండో సీడ్‌ నాదల్‌ 6–3, 6–3, 7–6 (7/0)తో 12వ సీడ్‌ డీగో ష్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెంటీనా)ను ఓడించాడు. మొత్తం 3 గంటల 9 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్‌లు ఏకపక్షంగా సాగగా...చివరి సెట్‌లో మాత్రం ష్వార్ట్‌జ్‌మన్‌ కొంత పోటీనివ్వగలిగాడు. అయితే తుది ఫలితం మాత్రం నాదల్‌కు అనుకూలంగానే వచ్చింది. 3 ఏస్‌లు కొట్టిన అతను ఒక్క డబుల్‌ఫాల్ట్‌ కూడా చేయలేదు. మ్యాచ్‌లో నాదల్‌ 38 విన్నర్లు కొట్టాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాదల్‌కు ఇది 99వ విజయం కావడం విశేషం. మరో మ్యాచ్‌ గెలిస్తే అతను 100వ విజయంతో పాటు 13వ సారి టైటిల్‌ను అందుకుంటాడు. ఇక్కడ 12 సార్లు ఫైనల్‌ చేరిన అతను 12 సార్లూ విజేతగా నిలిచాడు.