డీడీసీఏ అధ్యక్షుడిగా రోహన్‌ జైట్లీ

 


 కేంద్ర మాజీ మంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్‌ జైట్లీ కుమారుడు రోహన్‌ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ సంఘం (డీడీసీఏ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడవు శనివారంతో ముగియగా... అధ్యక్ష పదవి రేసులో రోహన్‌ మాత్రమే ఉండటంతో అతడిని ఏకగ్రీవం చేస్తున్నట్లు రిటర్నింగ్‌ అధికారి తెలిపారు. అధ్యక్ష పదవిలో రోహన్‌ వచ్చే ఏడాది జూన్‌ 30 వరకు ఉండనున్నారు. గతంలో అరుణ్‌ జైట్లీ 1999 నుంచి 2013 వరకు డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నారు. న్యాయవాది అయిన రోహన్‌... తండ్రి బాటలోనే నడుస్తూ డీడీసీఏ అధ్యక్ష పదవిని అలంకరించడంతో పలువురు క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. కోశాధికారి, డైరెక్టర్‌ పదవుల కోసం నవంబర్‌ 5–8 మధ్య ఎన్నికలు జరగనున్నాయి. కోశాధికారి పదవి కోసం బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సీకే ఖన్నా సతీమణి శశి, గౌతమ్‌ గంభీర్‌ మేనమామ పవన్‌ గులాటి మధ్య పోటీ నెలకొని ఉంది.