చెలరేగిన హెట్‌మెయిర్‌

 


  రాజస్తాన్‌ మొదటి మ్యాచ్‌లో మూడు సార్లు ఐపీఎల్‌ చాంపియన్‌ అయిన చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆడింది. 200 పైచిలుకు పరుగులు చేసి గెలిచింది. తర్వాత కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి మరీ జయభేరి మోగించింది. అయితే రాన్రానూ 150, 160 పరుగులకే ఆపసోపాలు పడుతోంది. వరుసగా ఓటమి పాలవుతోంది. ఇప్పుడు కూడా ఆ వరుసలో నాలుగో పరాజయాన్ని చేర్చింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 46 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది. షిమ్రాన్‌ హెట్‌మైర్‌ (24 బంతుల్లో 45; 1 ఫోర్, 5 సిక్సర్లు), స్టొయినిస్‌ (30 బంతుల్లో 39; 4 సిక్సర్లు) మెరిపించారు. ఆర్చర్‌ 3 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 19.4 ఓవర్లలో 138 పరుగులే చేసి ఆలౌటైంది. రాహుల్‌ తేవటియా (29 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్‌ (36 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుగనిపించారు. ఢిల్లీ బౌలర్‌ రబడ 3 వికెట్లు తీశాడు. కీలకమైన 2 వికెట్లు తీసిన అశ్విన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.