ఢిల్లీ క్యాపిటల్స్‌పై ప్రతీకారం  ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్‌ను కింగ్స్‌ పంజాబ్‌ 19 ఓవర్‌లో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా హ్యాట్రిక్‌ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వరుస ఓటములతో ఢీలా పడ్డ కింగ్స్‌ పంజాబ్‌.. ఆపై వరుసగా మూడో విజయాన్ని సాధించడంతో రేసులోకి వచ్చేసింది. ఆర్సీబీతో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత ముంబై ఇండియన్స్‌పై సూపర్‌ ఓవర్‌ గెలుపును అందుకుంది. ఆపై తాజా మ్యాచ్‌లో కూడా కింగ్స్‌ పంజాబ్‌ ఆకట్టుకుని ఢిల్లీపై పైచేయి సాధించింది. దాంతో ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సూపర్‌ ఓవర్‌లో ఓడిన దానికి కింగ్స్‌ పంజాబ్‌ ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. ఇది కింగ్స్‌కు నాల్గో విజయం కాగా, ఢిల్లీకి మూడో ఓటమి. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేఎల్‌ రాహుల్‌(15) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అనంతరం గేల్‌ బ్యాట్‌ను ఝుళిపించాడు. క్రిస్‌ గేల్‌(29;13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్‌ చేసి కింగ్స్‌ పంజాబ్‌ స్కోరును పరుగులు పెట్టించాడు. గేల్‌ రెండో వికెట్‌గా ఔటైన కాసేపటికి మయాంక్‌ అగర్వాల్‌(5) రనౌట్‌ అయ్యాడు. నికోలస్‌ పూరన్‌తో సమన్వయం లోపించడంతో మయాంక్‌ రనౌట్‌గా నిష్క్రమించాడు. కాగా, పూరన్‌(53; 28 బంతుల్లో 6 ఫోర్లు, 3సిక్స్‌లు) దుమ్ములేపడంతో కింగ్స్‌ పంజాబ్‌ రన్‌రేట్‌ ఎక్కడా తగ్గలేదు. అతనికి జతగా మ్యాక్స్‌వెల్‌(32; 24 బంతుల్లో 3 ఫోర్లు) మంచి సహకారం అందించాడు. ఈ జోడి నాల్గో వికెట్‌కు 69 పరుగులు జోడించడంతో కింగ్స్‌ పంజాబ్‌ గాడిలో పడింది. జట్టు స్కోరు 125 పరుగుల వద్ద ఉండగా పూరన్‌ ఔట్‌ కాగా, 147 పరుగుల వద్ద ఉండగా మ్యాక్స్‌వెల్‌ నిష్క్రమించాడు. చివర్లో దీపక్‌ హుడా(15 నాటౌట్‌; 22 బంతుల్లో 1 ఫోర్‌), నీషమ్‌(10 నాటౌట్‌; 8 బంతుల్లో 1 సిక్స్‌)లు లక్ష్యాన్ని పూర్తిచేసి కింగ్స్‌కు విజయాన్ని అందించారు. ఢిల్లీ బౌలర్లలో రబడా రెండు వికెట్లు సాధించగా, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌లకు తలో వికెట్‌ లభించింది.