మెరిసిన వాట్సన్‌, రాయుడు

 


 సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 168 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. సామ్‌ కరాన్‌(31; 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షేన్‌ వాట్సన్‌(42; 38 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు), అంబటి రాయుడు(41; 34 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌లు)లు రాణించడంతో సీఎస్‌కే పోరాడే స్కోరును బోర్డుపై ఉంచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సీఎస్‌కేకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డుప్లెసిస్‌ ఆడిన తొలి బంతికే గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌ను డుప్లెసిస్‌తో కలిసి సామ్‌ కరాన్‌ ఆరంభించాడు. అయితే డుప్లెసిస్‌ గోల్డెన్‌ డక్‌ కావడంతో వాట్సన్‌ ఫస్ట్‌ డౌన్‌ వచ్చాడు. కరాన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కాగా, సీఎస్‌కే స్కోరు 35 పరుగుల వద్ద కరాన్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. సందీప్‌ శర్మ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత వాట్సన్‌-అంబటి రాయుడులు ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించారు. భారీ షాట్లతో అలరించాడు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత రాయుడు భారీ షాట్‌ ఆడబోయి వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన ఫుల్‌టాస్‌ బాల్‌కు రాయుడు వికెట్‌ సమర్పించుకున్నాడు. కాసేపటికి వాట్సన్‌ కూడా అదే తరహాలో పెవిలియన్‌ చేరాడు. నటరాజన్‌ వేసిన ఫుల్‌టాస్‌ బంతికి షాట్‌ ఆడబోయిన వాట్సన్‌..మనీష్‌ పాండేకు క్యాచ్‌ ఇచ్చాడు. చివర్లో ధోని(21; 13 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌), జడేజా(25 నాటౌట్‌; 10 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌)లు ఆకట్టుకోవడంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ ,ఖలీల్‌ అహ్మద్‌, నటరాజన్‌లు తలో రెండు వికెట్లు సాధించారు.