ధరలు మళ్లీ పైపైకి!

 


 బంగారం ధరలు మళ్లీ భారమవుతున్నాయి. అమెరికాలో మరో ఉద్దీపన ప్యాకేజ్‌పై స్పష్టత రావడంతో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరలు భారమయ్యాయి. ఎంసీఎక్స్‌లో బుధవారం పదిగ్రాముల బంగారం 372 రూపాయలు పెరిగి 51,282 రూపాయలు పలికింది. ఇక కిలో వెండి 606 రూపాయలు పెరిగి 63,730 రూపాయలకు ఎగబాకింది. మరోవైపు నవంబర్‌ 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోగా ఉద్దీపన ప్యాకేజ్‌ వెలువడుతుందనే సంకేతాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పుంజుకున్నాయి. ప్యాకేజ్‌తో పాటు డాలర్‌ బలహీనపడటంతో స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌కు 1912 డాలర్లకు పెరిగింది. ఈ వారంలో ఉద్దీపన ప్యాకేజ్‌పై ఏకాభిప్రాయం సాధ్యమవుతుందని ఆశిస్తున్నామని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి ప్రకటన పసిడికి డిమాండ్‌ను పెంచింది.