గాంధీ నుండి ప‌రారైన‌ ఖైదీల కేసులో పురోగతి


గత నెల‌లో గాంధీ హాస్పిటల్ నుంచి తప్పించుకున్న ఖైదీల కేసులో పురోగ‌తి ల‌భించింది. ప‌రారైన న‌లుగురు నిందితుల్లో సోమా సుంద‌ర్ అనే వ్య‌క్త‌ని నార్త్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇత‌ని నుంచి మిగ‌తా నేర‌స్తుల స‌మాచారాన్ని పోలీసులు రాబ‌డుతున్నారు. వివ‌రాల ప్ర‌కారం.. జావిద్, న‌ర‌సింహా, సోమ సుందర్, ఆర్బాజ్ అఏ నలుగురు ఖైదీలను గ‌త నెల‌లో చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు. అయితే అదును చూసుకొని అక్క‌డినుంచి త‌ప్పించుకొని గుల్భ‌ర్గాకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. అక్క‌డ సైతం బైక్ చోరీలు చేద్దామ‌ని దుండ‌గులు ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో కొద్ది రోజులు క్రితం కొట్టేసిన బైక్‌ల‌తో సోమ‌సుంద‌ర్ అనే నిందితుడు హైద‌రాబాద్‌కు చేరుకున్నాడు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు వెంట‌నే అత‌న్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గుల్బ‌ర్గాలో మిగ‌తా ఖైదీల కోసం ప్ర‌త్యేక టీంల‌తో గాలిస్తున్నారు.