సహకార పొదుపు సంఘం నిధులు వాడుకున్న ఆర్టీసీ


ఉద్యోగులు దాచుకున్న పొదుపు మొత్తాన్ని సొంత అవసరాలకు వాడుకున్న ఆర్టీసీ ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి చెల్లించలేక హైకోర్టు బోనులో నిలబడాల్సి వచ్చింది. ఇప్పటికే ఓ సారి న్యాయస్థానం విధించిన గడువులోపు ఆ మొత్తాన్ని చెల్లించకపోవటంతో హైకోర్టు ఆర్టీసీకి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఈ నెల 6న కోర్టుకు వెళ్లి సమాధానం చెప్పాల్సి వస్తోంది. కోర్టు ధిక్కార కేసును ఎదుర్కొంటున్న రవాణా సంస్థ ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలో పాలుపోక హైరానా పడుతోంది. ఇదీ సంగతి.. ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్‌). ఉద్యోగులు తమ జీతాల నుంచి ప్రతినెలా 7 శాతం మొత్తాన్ని కోత పెట్టుకుని దీంట్లో పొదుపు చేసుకుంటారు. అలా జమయ్యే వాటి నుంచి పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇళ్ల నిర్మాణం, వైద్య ఖర్చు.... ఇలా పలు అవసరాలకు రుణంగా తీసుకుంటారు. దీనికి వడ్డీ చెల్లిస్తారు. ఇలా పెద్ద ఎత్తున రుణాలు అందించే సంస్థగా ఆసియా ఖండంలోనే సీసీఎస్‌కు రికార్డు ఉంది. అయితే.. రానురాను ఆర్టీసీ పూర్తిగా కుదేలు కావడం.. అప్పు కూడా పుట్టని స్థితిలో ఈ సీసీఎస్‌ నిధిని వాడేసుకుంది. ఫలితంగా సిబ్బంది ఇంతకాలం దాచుకున్న డబ్బులు అవసరాలకు తీసుకోలేని దుస్థితి నెలకొంది.