ఆ బిడ్డను ఒక్కరైనా పరామర్శించారా?  తెలంగాణలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ అన్నారు. రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లా మారుతోందని విమర్శించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో మాదిరిగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని, దోషులకు ఉరి శిక్ష వేయాలని డిమాండ్‌ చేశారు. మినిస్టర్‌ క్వార్టర్స్‌లో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ నివాసాన్ని సంపత్‌‌తోపాటు కాంగ్రెస్‌ నేతలు, అనుబంధ సంఘాల కార్యకర్తలు ముట్టడించారు. సమాచారం అందుకున్న పోలీసులు అందరిని అరెస్టు చేసి గోషామహాల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం హోంమంత్రి సంపత్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. దోషులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంపత్‌ మాట్లాడుతూ.. ‘నిన్న(బుధవారం) కేసీఆర్ శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల్లో ఆదర్శంగా ఉన్నామని అన్నారు. కేసీఆర్‌కు సిగ్గు ఉందా. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే మీ టీఆర్ఎస్ నాయకుడే అత్యాచారం చేసి హత్య చేసి ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించారు ఇది ఆదర్శంగా ఉందా. ఖమ్మంలో బాలికపై అత్యాచారయత్నం చేసి పెట్రోల్ పోసి కాల్చారు. ఆ బిడ్డ చావు బతుకుల్లో ఉంది. ఒక్కరైనా పరామర్శించారా. ఇదేనా మీ ఆదర్శం.. ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. హోంమంత్రి రాజీనామా చేయాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. అప్పటివరకు కాంగ్రెస్ ఉద్యమం ఆగద’ని ఆగ్రహం వ్యక్తం చేశారు.