రుణదాతలకు వీడియోకాన్‌

 


 రుణ బాకీలను సెటిల్‌ చేసుకునేందుకు, 13 గ్రూప్‌ కంపెనీలపై దివాలా చర్యలను ఆపివేయించుకునేందుకు వీడియోకాన్‌ గ్రూప్‌ మాజీ ప్రమోటరు వేణుగోపాల్‌ ధూత్‌ కుటుంబం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా రుణదాతలకు రూ. 30,000 కోట్లు కడతామంటూ ఆఫర్‌ చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను రుణదాతల కమిటీ (సీవోసీ) ముందు ఉంచినట్లు ధూత్‌ వెల్లడించారు. రుణదాతలు, నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) దీనికి అంగీకరించిన పక్షంలో ఈ ఏడాది ఆఖరు నాటికి సెటిల్మెంట్‌పై తుది నిర్ణయం రావచ్చని భావిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద చర్యలు ఎదుర్కొంటున్న 15 గ్రూప్‌ కంపెనీలకు గాను 13 సంస్థలకు సంబంధించి ఈ ఆఫర్‌ను ప్రతిపాదించినట్లు ధూత్‌ చెప్పారు. కేఏఐఎల్, ట్రెండ్‌ అనే రెండు సంస్థలను ఇందులో చేర్చలేదని వివరించారు. ‘వచ్చే 30 నుంచి 60 రోజుల్లోగా దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నాను‘ అని ధూత్‌ పేర్కొన్నారు. దివాలా పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసేందుకు, మరింత మెరుగైన విలువను రాబట్టేందుకు ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ మొత్తం 15 గ్రూప్‌ కంపెనీల కేసులను కలిపి విచారణ జరుపుతోంది.