ప్రయాణికులకు పలు ఆఫర్లు

 


 గ్రేటర్‌ వాసులను మెట్రో జర్నీ వైపు ఆకర్షించేందుకు మెట్రో రైలు సంస్థ పలు రాయితీలు కల్పించింది. దసరా సందర్భంగా ‘మెట్రో సువర్ణ’ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్‌ ప్రకారం ఈనెల 17 నుంచి 31 వరకు ప్రయాణికులకు టికెట్‌ చార్జీల్లో 40 శాతం రాయితీ లభించనుంది. అంటే ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ వరకు ప్రయాణానికి రూ.60 గరిష్ట చార్జీ ఉండగా... 40 శాతం రాయితీ పోను రూ.36 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఆఫర్లలో భాగంగా గరిష్టంగా 40 ట్రిప్పులకు చార్జీ చెల్లించి 60 ట్రిప్పులు జర్నీ చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ రాయితీల వివరాలను శుక్రవారం సాయంత్రం రసూల్‌పురాలోని మెట్రోరైలు కార్యాలయంలో హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డిలు సంయుక్తంగా ప్రకటించారు. కాగా లాక్‌డౌన్‌కు ముందు ఎల్బీనగర్‌– మియాపూర్, జేబీఎస్‌– ఎంజీబీఎస్, నాగోల్‌– రాయదుర్గం.. మొత్తం మూడు రూట్లలో నిత్యం 3.5 లక్షల మంది మెట్రో జర్నీ చేసేవారు. ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ రోజుకు 90 వేలకు తగ్గింది. ఇటీవలి వర్షాలకు నగరంలో భారీగా రహదారులు దెబ్బతినడం, తమ ఆఫర్ల కారణంగా మెట్రో తిరిగి పూర్వపు స్థాయిలో ప్రయాణికులతో కళకళలాడుతుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు.