కాంగ్రెస్ ఎమ్మెల్యే కు తృటిలో పెను ప్రమాదం

 


పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుశీల్ రింకూకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రింకూ ప్రయాణిస్తున్న కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యే గన్‌మెన్‌, డ్రైవర్ కూడా స్వల్పంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, అదే కారులో ఉన్న ఎమ్మెల్యే వంట మనిషి మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు. ఈ మధ్యాహ్నం ఎమ్మెల్యే రింకూ జలంధర్ నుంచి చండీగఢ్‌కు వెళ్తుండగా నవాన్‌షహర్‌-చండీగఢ్ రోడ్డులో జడ్లాకు సమీపంలో దౌలత్‌పూర్ చౌక్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది.  వడ్ల బస్తాల లోడుతో ట్రాక్టర్ జడ్లాకు వెళ్తుండగా కారు దాన్ని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారు వేగాన్ని అదపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. కాగా, ఎమ్మెల్యే రింకూ జలంధర్ (వెస్ట్) నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.