చెలరేగిన ఓపెనర్లు డుప్లెసిస్, వాట్సన్‌


చెన్నై దర్జాగా చిందేసింది. ప్రత్యర్థి తమ ముందు గట్టి లక్ష్యాన్నే నిర్దేశించినా... ఓపెనర్లు వాట్సన్‌ (53 బంతుల్లో 83 నాటౌట్‌; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), డుప్లెసిస్‌ (53 బంతుల్లో 87 నాటౌట్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌) వేసిన పరుగుల బాటతో సూపర్‌కింగ్స్‌ విజయబావుటా ఎగరేసింది. ఆదివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ధోని బృందం 10 వికెట్ల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్‌ లోకేశ్‌ రాహుల్‌ (52 బంతుల్లో 63; 7 ఫోర్లు, 1 సిక్స్‌) స్కోరుబోర్డును నడిపించగా... పూరన్‌ (17 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరిపించాడు. శార్దుల్‌ ఠాకూర్‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌ 17.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండానే 181 పరుగులు చేసి గెలిచింది. వాట్సన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. కింగ్స్‌ తుది జట్టులో కరుణ్, గౌతమ్, నీషమ్‌లను పక్కనబెట్టి మన్‌దీప్, హర్‌ప్రీత్‌ బ్రార్, జోర్డాన్‌లను తీసుకోగా... చెన్నై మార్పులేకుండా గత మ్యాచ్‌ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది.