మల్లన్నసాగర్, గంధమల రిజర్వాయర్ల నుంచి లింక్‌ కెనాల్‌ ద్వారా నీటి సరఫరా  కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని మరింతగా వినియోగంలోకి తెచ్చే దిశగా ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక రచించింది. గోదావరి జలాల ఆధారంగా చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకంలో నీరందని చివరి ఆయకట్టు ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టుల్లోని రిజర్వా యర్‌ల ద్వారా నీరందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మల్లన్నసాగర్, గంధమల రిజర్వా యర్ల నుంచి లింక్‌ కెనాల్‌లను తవ్వి దేవాదుల లోని 2.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిం చాలని భావిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకట్రెండు రోజుల్లో సమీక్షించి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘మల్లన్న’ ద్వారా 1.37 లక్షల ఎకరాలు.. దేవాదులలో భాగంగా గంగాపురం ఇన్‌టేక్‌ పాయింట్‌ నుంచి నీటిని ఎత్తిపోస్తూ 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంది. నిర్ణీత ఆయకట్టుకు నీటిని తరలించాలంటే సుమారు 200 కి.మీ.కిపైగా నీటిని తరలించాల్సి ఉంది. ఇందుకోసం కనీసం 460 మీటర్ల మేర నీటిని ఎత్తిపోయాల్సి వస్తోంది. ఈ స్థాయిలో ఎత్తి పోతలు చేసినా చివరి ఆయకట్టుకు నీరందడం కష్టంగా ఉందని భావించిన ప్రభుత్వం... కాళేశ్వ రంలోని వివిధ రిజర్వాయర్ల నుంచి దేవాదుల చివరి ఆయకట్టుకు నీటిని తరలించే అంశాలపై అధ్యయనం చేసింది. కాళేశ్వరం ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటికి తోడు అదనంగా మరో టీఎంసీని తీసుకొనేలా పనులు చేపట్టినందున ఈ నీటిని మరింత సద్వినియోగం చేసుకొనేలా దేవాదులతో అనుసంధాన ప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరపైకి తెచ్చారు.