బ్రాండ్‌ మీది.. ప్రమోషన్‌ మాది


వ్యాపారం, ప్రొడక్ట్స్, సంస్థలు, స్టార్టప్‌ కంపెనీలు, సరికొత్త డిజైన్స్‌ ఇలా ఏదైనా సరే మార్కెట్‌లో ఓ ‘బ్రాండ్‌ ’గా స్థిరపడాలనుకుంటాయి.. దానికి నాణ్యత, ట్రెండ్‌ని సెట్‌ చేసే లక్షణాలు ఉంటే సరిపోదు. అది జనాలకు చేరాలి.. మెరుగైన ప్రచారం కల్పించాలి. దానికి అనువైన మార్గం డిజిటల్‌ మార్కెటింగ్‌. అయితే ఒకప్పుడు నగరంలో బ్రాండ్‌ ప్రమోషన్‌కి బెంగళూర్, నోయిడా తదితర ప్రాంతాలకు చెందిన ఆన్‌లైన్‌ ప్రమోటర్స్‌ని ఆశ్రయించేవారు. ప్రస్తుతం నగరవాసులు కూడా సోషల్‌ మీడియా, డిజిటల్‌ మార్కెటింగ్‌లో రాణిస్తున్నారు. అందులో భాగంగా బ్రాండ్‌ ప్రమోషన్‌లో కొత్త ట్రెండ్స్‌ సెట్‌ చేస్తూ ముందుకు వెళ్తోంది ‘వీ ఆర్‌ వెరీ.ఇన్‌’.. టెక్నాలజీ పెరిగాక ప్రచార మాద్యమాలు కూడా కొత్త పుంతలు తొక్కాయి. ప్రస్తుతం షాపింగ్‌ మొదలు చదువుల వరకు అన్నీ ఆన్‌లైన్‌ పరమయ్యాయి. కొత్త డిజైన్‌ వేర్స్‌ నుంచి వస్తువుల నాణ్యత వరకు ఆన్‌లైన్‌లోనే వెతుకుతున్నారు. దీన్ని ఆసరా చేసుకొని పెద్ద కంపెనీలు, చిన్న కంపెనీలు, కొత్త స్టార్టప్‌లు, ఫ్యాషన్, విద్య, వైద్యం, వినోదం.. అందరూ బ్రాండ్‌ మార్కెటింగ్‌కి జై అంటున్నారు. దీని కోసం నగరంలో కొన్ని సంవత్సరాలుగా వేలకు పైగా ప్రమోటర్స్‌ పుట్టుకొచ్చారు. ఆన్‌లైన్, సోషల్‌ మీడియా వేదికగా వీరిదే హవా అంతా.. యాడ్స్, అడ్వర్టైజ్‌మెంట్, సోషల్‌మీడియా ప్రమోషన్, డిజిటల్‌ మార్కెటింగ్‌ ఇలా ఎన్నో మార్గాల ద్వారా బ్రాండ్‌లను పాపులర్‌ చేస్తుంటారు. ఈ రంగంలో రాణించాలంటే అన్ని రకాల సామాజిక, సాంకేతిక మూలాలపై అవగాహన, కాలానుగుణమైన హంగులను అలవర్చుకునే నేర్పు అతి ముఖ్యం. దీని ఆవశ్యకత తెలుసుకున్నాక నగరవాసులు కూడా ఈ మాద్యమంపై ఆసక్తి చూపిస్తున్నారు.