టారిఫ్‌లు, డేటా వినియోగం ఊతం  టెలికం సంస్థలకు యూజర్లపై వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) క్రమంగా పెరగనుంది. కరోనా వైరస్‌ కాలంలో పెరిగిన డేటా వినియోగం, టారిఫ్‌ల పెంపు (మార్కెట్‌ ఆధారితమైనది కావొచ్చు లేదా నియంత్రణ సంస్థపరమైన చర్యల ఆధారితమైనదైనా కావొచ్చు) తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. జేఎం ఫైనాన్షియల్‌ సంస్థ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దేశీ టెలికం రంగంలో కన్సాలిడేషన్‌ ప్రక్రియ దాదాపు పూర్తయిపోయిన నేపథ్యంలో ఏఆర్‌పీయూల పెరుగుదల తప్పనిసరిగా ఉండవచ్చని, ఫలితంగా 2024–25 నాటికి పరిశ్రమ ఆదాయం రెట్టింపై సుమారు రూ. 2,60,000 కోట్లకు చేరవచ్చని పేర్కొంది. భవిష్యత్‌ పెట్టుబడుల అవసరాలను బట్టి చూస్తే 2025 ఆర్థిక సంవత్సరం నాటికి టెల్కోల ఏఆర్‌పీయూ రూ. 230–250 స్థాయికి చేరాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది.ఇక ఆధిపత్యమంతా రెండు కంపెనీలదే కాకుండా చూసేందుకు వొడాఫోన్‌ ఐడియా మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే.. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి ఆ సంస్థ ఏఆర్‌పీయూ రూ. 190–200 దాకా ఉండాల్సి వస్తుందని పేర్కొంది.