ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయంఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వర్షాల వల్ల నష్టపోయిన వరి, వేరుశనగ, పత్తి రైతులకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్షాలు కారణంగా దెబ్బతిన్న వరి, వేరుశెనగ, పత్తిలాంటి పంటలను కొనుగోలు చేయడంలో రైతులు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పత్తిరైతులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. సీఎంయాప్‌ (కాంప్రహెన్సివ్‌ మానిటరింగ్‌ అగ్రికల్చర్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌) పనితీరుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రైతులకు సరైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధర ఉందని యాప్‌లో అలర్ట్‌ వస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. 10,641 ఆర్బీకేల ద్వారా పంటలకు కనీస ధరలు ఉన్నాయా? లేవా? అన్న సమాచారం ప్రతిరోజూ కచ్చితంగా రావాలని సీఎం జగన్ చెప్పారు. ఆ నివేదికలను, అలర్ట్స్‌ను ప్రతిరోజూ పరిశీలించాలని, ఎందుకు కనీస ధర రావడంలేదో పరిశీలన చేసి, ఆమేరకు జిల్లాల్లో ఉన్న జేసీల ద్వారా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. రైతుల నుంచి చేసిన కొనుగోళ్లకు 10 రోజుల్లోగా డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంటలకు కనీస మద్దతు ధరల రేట్లను ఆర్బీకేల్లో పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టాలని చెప్పారు. వ్యవసాయశాఖ మంత్రి నేతృత్వంలో ప్రతిరోజూ పంటల ధరలు, పరిస్థితులపై సమీక్ష చేయాలని జగన్ ఆదేశించారు. పంటను అమ్ముకోవడానికి రైతు ఇబ్బంది పడకూడదని, అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పారు. ప్రత్యామ్నాయ మార్కెట్లు చూపాలని, లేకపోతే వెంటనే ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆదేశించారు.


ఆర్బీకేల పరిధిలో మల్టీ పర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు వ్యవసాయ రంగంలో మరొక విప్లవాత్మక మార్పుగా బహుళ సదుపాయాలున్న మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి ఆర్బీకే పరిధిలో ఈసెంటర్లను తీసుకొస్తోంది. దీంట్లో భాగంగా గోడౌన్లు, కోల్డ్‌ రూమ్స్, డ్రైయింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్, ఆక్వా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆర్బీకే పరిధిలో వ్యవసాయ యంత్ర పరికరాలు, మండలాల పరిధిలో వ్యవసాయ యంత్ర పరికరాలు, ప్రొక్యూర్‌ మెంట్‌ సెంటర్లు , బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, ఆక్వాబజార్, ప్రి ప్రాససింగ్‌ ప్లాంట్లు, ప్రాససింగ్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. పై అన్నిరకాల పనులన్నీకూడా ఏక కాలంలో ముందుకు సాగాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.

అమూల్‌తో అవగాహన ఒప్పందం- అమలుపై సమీక్ష
రాష్ట్రంలో పాడిపరిశ్రామిభివృద్ధి, మహిళా ఆర్థికాభివృద్ధికోసం ఉద్దేశించిన అమూల్‌తో అవగాహన ఒప్పందం, దాని అమలుపైనా సీఎం జగన్ సమీక్షించారు. రైతులనుంచి పాలసేకరణ, బల్క్‌మిల్క్‌ యూనిట్లు ఏర్పాటు తదితర అంశాలపై అధికారులనుంచి వివరాలు తెలుసుకున్నారు. చేయూత ద్వారా లబ్ధిపొందిన మహిళలు పోషిస్తున్న పాడిపశువుల నుంచి తప్పకుండా పాలసేకరణ చేయడం ద్వారా, వారికి మేలు జరగాలన్నారు. ఆయా మహిళలకు పాడిపశువుల పంపిణీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. నవంబర్‌ 25 నుంచి కొన్ని బీఎంసీల్లో కార్యకలాపాలకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్పారు. ఒంగోలు, మదనపల్లి డైరీల ద్వారా కార్యకలాపాలకు సిద్ధమవుతున్నామని వివరించారు. వీలైనంత త్వరగా అన్నిచోట్లా కార్యకలాపాలు ప్రారంభం కావాలని, తద్వారా మహిళలకు అండగా నిలవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.