సాయుధ బలగాలతో పోరుకు మావోలు సై?

 


 తెలంగాణలో మావోయిస్టులు బలపడుతున్నారా? తమపై పోలీసులు– కేంద్ర బలగాలు ప్రకటించిన యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ములుగు జిల్లా వెంకటాపురం హత్యతో సంకేతాలు పంపారా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గణపతి తరువాత రెండేళ్ల క్రితం మావోయిస్టు పగ్గాలు చేపట్టిన నంబాల కేశవరావు (అలియాస్‌ గంగన్న, అలియాస్‌ బసవరాజు, అలియాస్‌ బైరు) మొదటి నుంచి దూకుడుగానే వ్యవహరిస్తున్నాడు. మిలిటరీ ఆపరేషన్లు, ఆంబుష్‌లు, మెరుపుదాడుల్లో ఇతను సిద్ధహస్తుడు. మావోయిస్టుల ఏరివేతకు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలలో కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌ ప్రహార్‌ మాదిరిగానే.. తెలంగాణలోనూ కేంద్రబలగాలు రంగంలోకి దిగుతాయన్న ప్రచారంతో తాము కూడా వెనక్కితగ్గబోమన్న సంకేతాలు ఇచ్చే క్రమంలోనే మావోలు తాజాగా వెంకటాపురం (ములుగు)లో హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.