అవును... తప్పుకున్నాను

 


 ‘విజయ్‌ సేతుపతి నటిస్తున్న ‘తుగ్లక్‌ దర్బార్‌’ సినిమాలో నేను నటించడం లేదు’ అని హీరోయిన్‌ అదితీ రావ్‌ హైదరీ తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘కరోనా వల్ల భారతీయ చలన చిత్రపరిశ్రమతో సహా ప్రపంచ సినీ లోకమే గత ఎనిమిది నెలలుగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దశలవారీగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్స్‌ను మొదలుపెట్టారు. షూటింగ్‌ ప్రారంభించిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇంకా ప్రారంభించని ప్రాజెక్ట్‌లు కూడా నా వల్ల ఆలస్యం కాకూడదనుకుంటున్నాను. ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల నిర్మాత, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోకు చెందిన లలిత్‌ కుమార్‌ నిర్మాణంలో విజయ్‌ సేతుపతి హీరోగా డిల్లీ ప్రసాద్‌ దర్శకత్వంలో రానున్న ‘తుగ్లక్‌ దర్బార్‌’ నుండి తప్పకుంటున్నాను. ఈ చిత్రబృందానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేను చేయాల్సిన పాత్రను చేయబోతున్న రాశీ ఖన్నాకు ఆల్‌ ది బెస్ట్‌’’ అని పేర్కొన్నారు అదితీ రావ్‌ హైదరీ.