రాజస్తాన్‌లో సైబర్‌ క్రైం పోలీసుల సాహసం

 


 అది రాజస్తాన్‌ సరిహద్దుల్లోని మేవాట్‌ ప్రాంతం.. భరత్‌పూర్‌ జిల్లాలో ఉన్న మూడు పక్కపక్క గ్రామాలు.. సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతం.. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులతో పాటు అక్కడి అధికారులతో కూడిన బృందం.. ‘ఓఎల్‌ఎక్స్‌ కేటుగాళ్ల’కోసం గ్రామాల్లో వేట మొదలెట్టింది.. ప్రతిఘటించిన నేరగాళ్లు, వారి కుటుంబీకులు ఎదురుదాడి చేశారు. టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి 18 మంది దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తతంగమంతా ‘ఖాకీ’సినిమాను తలపించింది. వీరిని శుక్రవారం హైదరాబాద్‌ తీసుకొచ్చి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపినట్లు సీసీఎస్‌ విభాగం డీసీపీ అవినాష్‌ మొహంతి వెల్లడించారు. ఈ నెల 9న కూడా మరో 8 మంది నేరగాళ్లను అరెస్టు చేశారు. అమ్ముతామంటూ.. కొంటామంటూ.. భరత్‌పూర్‌ జిల్లాకు చెందిన చాలా గ్రామాల్లో ఈ ఓఎల్‌ఎక్స్‌ కేటుగాళ్ల అడ్డాలు ఉన్నాయి. ఆర్మీ అధికారుల మాదిరిగా ఫొటోలకు పోజులిస్తూ.. ఓఎల్‌ఎక్స్‌ వంటి ఈ–యాడ్స్‌ వెబ్‌సైట్లలో వివిధ ప్రకటనలు ఇస్తుంటారు. సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తామంటూ పేర్కొంటారు. వాటిని చూసి సంప్రదించిన వారి నుంచి అడ్వాన్సుల రూపంలో వీలున్నంత దోచేస్తారు. మరోపక్క ఆయా వెబ్‌సైట్లలో సామాన్యులు పెట్టిన సెకండ్‌ హ్యాండ్‌ వస్తువుల అమ్మకం ప్రకటనలకు స్పందించి వాటిని విక్రయిస్తామని కూడా డబ్బు స్వాహా చేస్తారు.