సీఎం కేసీఆర్‌ దత్త పుత్రిక నిశ్చితార్థం  ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత తీసుకున్న ప్రత్యూష త్వరలో ఓ ఇంటి కోడలుగా వెళ్లబోతున్నారు. రాంనగర్‌ ప్రాంతానికి చెందిన మమత, మర్ రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డితో ప్రత్యూష నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకను విద్యానగర్‌లోని హోటల్‌లో నిరాడంబరంగా నిర్వహించారు. వరుణు చరణ్‌రెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కాగా గతంలో సొంత తండ్రి, పినతల్లి చిత్రహింసలతో తీవ్ర గాయాలపాలైన ప్రత్యూష ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె దీనస్థితిని చూసి చలించిపోయిన సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో తానే స్వయంగా ప్రత్యూషను దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆమె సంరక్షణ బాధ్యతలను ఐఏఎస్‌ అధికారి రఘునందన్‌రావుకు అప్పగించారు.ఐఏఎస్‌ అధికారి పర్యవేక్షణలో ప్రత్యూష బాగోగులు మహిళా శిశు సంక్షేమ శాఖ చూస్తోంది.ఈ ఐదేళ్లలో ఆమె ఆరోగ్యపరంగా మెరుగైంది. ఉన్నత చదువులు చదివిన ప్రత్యూష.. నర్సింగ్‌ కోర్సు పూర్తిచేసి, ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నది. ఈ క్రమంలో ప్రత్యూష గురించి తెలుసుకున్న చరణ్‌రెడ్డి.. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ముందుకొచ్చాడు. ఈ మేరకు ఆమెను సంప్రదించగా ఆమె కూడా ఓకే చెప్పింది.దీంతో మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలుపగా.. వారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.