అబద్ధాలకోరు టీఆర్‌ఎస్‌ను ఓడించండి: ఉత్తమ్‌

 


 దుబ్బాక ఉప ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం వ్యాపిస్తోందని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తోందని, టీఆర్‌ఎస్‌ పతనం ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగు పడుతాయని యువకులు, విద్యార్థులు ఉద్యమంలో పాల్గొని బంగారు భవిష్యత్‌ను ఫణంగా పెట్టారన్నారు. తీరా రాష్ట్రం ఏర్పాటు తర్వాత కల్వకుంట్ల కుటుంబమే బాగు పడిందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మాజీ మంత్రి ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధే కన్పిస్తుందని, ఆయన కుమారుడు శ్రీనివాస్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అక్రమ సంపాదన డబ్బులు ఎన్నికల్లో ఖర్చు చేయడం టీఆర్‌ఎస్‌కు రివాజుగా మారిందన్నారు. తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరగడం లేదని, నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అసెంబ్లీలో చెప్పిన విషయం ఆయన గుర్తు చేశారు. 2014, 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్‌ ఎన్నిక సందర్భంగా కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. అబద్ధాలకోరు టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించాలని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని, ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేసి అర్హులైన వారందరి స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ పార్టీకే పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దుబ్బాక ఫలితాల వైపు రాష్ట్రం మొత్తం చూస్తోందని, సంచలన తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరారు. బీజేపీకి గ్రామాల్లో ఓటర్లే లేరన్నారు. మూడో స్థానంలో నిలిచే బీజేపీకి ఓటు వేయడం వృథా అన్నారు.