దుబ్బాక ఎన్నికలు: రంగంలోకి హరీశ్‌రావు


దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు ఓటమిల విషయం కాకుండా టీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకుపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అధికార పార్టీ మాత్రం గత ఎన్నికలకు మించిన మెజార్టీని తీసుకు వచ్చేందుకు వ్యూహ రచన చేస్తోంది. ఏ ఎన్నిక జరిగినా తనదైన శైలిలో ముందుకు వెళ్లే ట్రబుల్‌ షూటర్‌ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గెలుపు బాధ్యత భుజాన వేసుకున్నారు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి వరుసగా 37,925, 62,500 మెజార్టీ వచ్చింది. అయితే ఈ ఉప ఎన్నికలో లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. దొమ్మాట నియోజకవర్గంలో అంతర్భాగమైన దుబ్బాక 2009 ఎన్నికల ముందు జరిగిన నియోజవర్గాల పునర్‌ విభజనతో నియోజకవర్గంగా మారింది. ఇది సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, రాయపోలు, దౌల్తాబాద్, మెదక్‌ జిల్లాలోని చేగుంట, నార్సింగ్, మండలాలు కలిపి ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,90,483 మంది ఓటర్లున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి అతిస్వల్ప మెజార్టీ 2,640తో గెలపుపొందగా.. తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సోలిపేట రామలింగారెడ్డి 2014లో 37,925 మెజార్టీ, 2018లో 62,500 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రెండో సారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన యాడాదిన్నరతర్వాత జరిగే దుబ్బాక ఉప ఎన్నిక ఆ పార్టీ పని తీరుకు నిదర్శనంగా నిలవనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీన్ని రుజువు చేసేందుకు గతం ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలని టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.