సుజాతకు అఖండ మెజార్టీ ఖాయం

 


 దుబ్బాక ఉప ఎన్నికలో దివం గత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతను అఖండ మెజార్టీతో గెలిపించుకుందామని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మంగళవారం దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, క్రాంతి తదితరులు సుజాతను ఓదార్చారు.ప్రచారానికి రావాలంటూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. టీఆర్‌ ఎస్‌ ఆవిర్భావం నుంచి జర్నలిస్టుగా, ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడుగు జాడల్లో నడిచిన గొప్ప ప్రజా నాయకుడు రామలింగారెడ్డి అని చెప్పారు. ఆయన ఆశయాల సాధన కోసం సీఎం ఆ కుటుంబానికే టికెట్‌ ఇచ్చారని పేర్కొన్నారు. పేదల కష్టాలు తెలిసిన సుజాతను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పారు. ‘సుజాత నాకు చెల్లెలాంటిది. ఆ కుటుంబం చాలా బాధలో ఉంది. మా చెల్లెకు సీఎం కేసీఆర్‌ సందేశం ఇచ్చి.. టికెట్‌ ఖరారు చేశారని చెప్పి ఆ కుటుంబానికి ధైర్యం, విశ్వాసం నింపేందుకు వచ్చామని తెలిపారు. సుజాతకు తాను, ఎంపీ ప్రభాకర్‌ ఎడమ, కుడి భుజాలమని, అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తామన్నారు. దుబ్బాక దశ, దిశను మార్చిన గొప్ప నాయకుడు రామలింగారెడ్డి అని కితాబిచ్చారు. ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగా ల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సుజాతకు తాము వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు.