చెన్నై జట్టులో మార్పులు చేయాలని గౌతం గంభీర్ చెప్పాడు

 ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుత చెన్నై జట్టులో ఎన్నో మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉందని టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. వచ్చే లీగ్‌ వేలంలో కొత్త చెన్నై జట్టును చూస్తామని అన్నాడు. అయితే ప్రస్తుత ధోనీసేనకు యువ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ ఎంతో సానుకూలాంశమని పేర్కొన్నాడు. ఏటా ఆటలో మెరుగవుతున్న అతడు భవిష్యత్తులో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా నిలుస్తాడని తెలిపాడు. ''ప్రస్తుత చెన్నై జట్టును సమూల మార్పులు చేసి పునరుద్ధరించాలి. ఆ జట్టులో ప్రతిభావంతులు ఉన్నారు. కానీ వాళ్లందరినీ తర్వాత సీజన్‌లో కొనసాగించడం కష్టం. ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఆ జట్టుతో పయనిస్తారు. అయితే గతంలో జరిగిన లీగ్‌ వేలాల్లో చెన్నై ఎప్పుడూ చురుకుగా పాల్గొనలేదు. పాతజట్టునే కొనసాగించడానికి మక్కువ చూపించేవారు. కానీ, 2021 వేలంలో సంపూర్ణ కొత్త చెన్నై జట్టును చూస్తాం. ఈ సారి యువకులపై వారి దృష్టి ఉంటుంది. కాస్త అనుభవం, అత్యంత శక్తిమంతులతో జట్టును తయారుచేస్తారు'' అని గంభీర్‌ వెల్లడించాడు. ''అయితే ప్రస్తుతం ఎన్నో ప్రతికూలాంశాల మధ్య ఉన్న చెన్నై జట్టుకు ఊరట కలిగించేది సామ్‌ కరన్‌. జట్టులో సానుకూలాంశం అతడొక్కడే. కచ్చితంగా అతడిని జట్టులో కొనసాగిస్తారు. ఎందుకంటే సామ్‌కరన్‌ యువకుడు, అంతేగాక ప్రతి ఏడాది ఆటలో మరింత మెరుగవుతున్నాడు. భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా నిలుస్తాడు'' అని గంభీర్‌ పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన సామ్‌ 186 పరుగులతో పాటు 13 వికెట్లు తీశాడు.