కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, గ్రామీణ గృహ నిర్మాణంపై దృష్టి పెట్టడంతో కన్జూమర్ డ్యురబుల్స్, సిమెంట్ రంగాలకు డిమాండ్ పెరిగే వీలున్నట్లు ఒక ఇంటర్వ్యూలో ఏంజెల్ బ్రోకింగ్ ఈక్విటీ వ్యూహకర్త జ్యోతి రాయ్ పేర్కొన్నారు. ఇంకా మార్కెట్లు, ఐపీవోలు, కంపెనీలపట్ల పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. మార్కెట్లు బలపడొచ్చు మార్కెట్లు తగ్గినప్పుడల్లా కొనుగోళ్లు చేపట్టవచ్చని భావిస్తున్నాం. గత నెలలో తయారీ రంగ పీఎంఐ 2012 జనవరి తదుపరి 56.8కు చేరింది. ఇది ఆర్థిక రికవరీని సూచిస్తోంది. ప్రభుత్వం అన్‌లాక్‌లో భాగంగా పలు నిబంధనలు సడలించడంతో కొద్ది నెలలపాటు సెంటిమెంటు బలపడే వీలుంది. అయితే ఆర్థిక వ్యవస్థను తిరిగి ఓపెన్ చేయడం ద్వారా కోవిడ్-19 కేసులు పెరిగే వీలుంది. ఇదే విధంగా కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ ఆలస్యంకావచ్చు. యూఎస్ ప్రభుత్వం సహాయక ప్యాకేజీపై వెనకడుగు వేయవచ్చు. ఇలాంటి అంశాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపే వీలుంది.