యుద్ధానికి వెళ్తున్నట్లనిపించింది


‘ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణం అంటే యుద్ధానికి వెళ్తున్న భావన కలుగుతోంది’’ అంటున్నారు మీనా. మలయాళ చిత్రం ‘దృశ్యం’కి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ తెరకెక్కుతోంది. మోహన్‌ లాల్, మీనా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఏడు నెలల తర్వాత విమానయానం చేశారు మీనా. పీపీఈ కిట్‌ ధరించి ప్రయాణం చేశారామె. దీని గురించి మీనా మాట్లాడుతూ –‘‘ఈ దుస్తులన్నీ చూస్తుంటే అంతరిక్షానికి వెళ్తున్నట్టు అనిపించింది. అలాగే ఏదో యుద్ధానికి వెళుతున్న ఫీల్‌ కలిగింది. విమానాశ్రయం చాలా ఖాళీగా ఉంది. నాలా ఎవ్వరూ డ్రెస్‌ (పీపీఈ కిట్స్‌) చేసుకోకపోవడం భలే ఆశ్చర్యంగా అనిపించింది. ఈ డ్రెస్‌లో ప్రయాణం చాలా కష్టం. బయట చల్లగా ఉన్నప్పటికీ లోపల ఒకటే ఉక్కపోత. వీటితో రోజూ మన కోసం కష్టపడుతున్న అందరికీ నా సెల్యూట్‌’’ అన్నారు.