రెండు కంపెనీల విలీనానికి గ్రీన్‌సిగ్నల్

 


 రెండు కంపెనీల విలీనానికి ఆయా బోర్డులు ఆమోదముద్ర వేసిన వార్తలతో శ్రీకాళహస్తి పైప్స్‌, ఎలక్ట్రోస్టీల్‌ క్యాస్టింగ్స్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో మెరుగైన పనితీరు ప్రదర్శించనున్న అంచనాలతో హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ థైరోకేర్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ నెలకొంది. వెరసి శ్రీకాళహస్తి పైప్స్‌, ఎలక్ట్రోస్టీల్‌ క్యాస్టింగ్స్‌ షేర్లు పతనంకాగా.. థైరోకేర్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌ దూకుడు చూపుతోంది. వివరాలు చూద్దాం.. విలీన ఎఫెక్ట్‌ విలీన ముసాయిదా ప్రతిపాదనలపై అటు శ్రీ కాళహస్తి పైప్స్‌(ఎస్‌పీఎల్‌), ఇటు ఎలక్ట్రోస్టీల్‌ క్యాస్టింగ్స్‌(ఈసీఎల్‌) బోర్డులు ఆమోదముద్ర వేశాయి. సోమవారం సమావేశమైన బోర్డు ఇందుకు అనుమతించినట్లు రెండు కంపెనీలూ పేర్కొన్నాయి. విలీనంలో భాగంగా ఎస్‌పీఎల్‌ వాటాదారులు తమ వద్ద గల ప్రతీ 10 షేర్లకుగాను 59 ఈసీఎల్‌ షేర్లను పొందనున్నట్లు తెలియజేశాయి. ఈ వార్తలతో ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఎస్‌పీఎల్‌ షేరు 18 శాతం కుప్పకూలింది. రూ. 109కు చేరింది. ప్రస్తుతం 14.5 శాతం పతనంతో రూ. 114 వద్ద ట్రేడవుతోంది. ఇక ఈసీఎల్‌ సైతం తొలుత 13 శాతం తిరోగమించి రూ. 20ను తాకింది. ప్రస్తుతం 8.2 శాతం నష్టంతో రూ. 21.30 వద్ద ట్రేడవుతోంది. థైరోకేర్‌ టెక్నాలజీస్‌ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 171 శాతం జంప్‌చేసినట్లు థైరోకేర్‌ టెక్నాలజీస్‌ తాజాగా వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన 37 శాతం పెరిగినట్లు తెలియజేసింది. కోవిడ్‌- పీసీఆర్‌, కోవిడ్‌- యాంటీబాడీ పరీక్షలు ఇందుకు సహకరించినట్లు పేర్కొంది. ఈ కాలంలో 4 లక్షలకుపైగా కోవిడ్‌- 19.. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించినట్లు తెలియజేసింది. దీంతో థైరోకేర్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 17 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 910 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 15 శాతం లాభంతో రూ. 890 వద్ద ట్రేడవుతోంది.