పాలమూరు ప్రాజెక్టు సొరంగం పనుల్లో బ్లాస్టింగ్‌
  పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంపుహౌస్‌తో పాటు అప్రోచ్‌ చానల్‌ కోసం భూగర్భంలో చేపట్టిన పేలుళ్ల వల్లనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐ) పరిధిలోని పంపులు నీట మునిగాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. లిఫ్ట్‌లోకి నీళ్లు రావడానికి గల కారణాల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టులో అండర్‌ గ్రౌండ్‌ పంపుహౌస్‌ నిర్మిస్తే కల్వకుర్తి పంపుహౌస్‌ దెబ్బతింటుందని సీనియర్‌ ఇంజనీర్లు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే అండర్‌ టన్నెల్‌ (సొరంగం) పనుల్లో ఎక్కువ సామర్థ్యంతో కూడిన కెమికల్‌ను వినియోగిస్తూ బ్లాస్టింగ్‌ చేయడం వల్ల భూగర్భంలో ఉన్న కేఎల్‌ఐ లిఫ్ట్‌కు ప్రకంపనలు వస్తున్నాయని, దాని వల్ల లీకేజీలు, స్లాబ్‌ క్రాక్‌లు, అద్దాలు పగిలిపోతున్నాయని లిఫ్ట్‌ నిర్వాహకులు రెండేళ్ల క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గతేడాది మేలో కేఎల్‌ఐ, పాలమూరు ప్రాజెక్టు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. గతేడాది ఆగస్టు 7న పాలమూరు ప్రాజెక్టు సీఈ రమేశ్, ఈఈ విజయ్‌కుమార్, కేఎల్‌ఐ ఎస్‌ఈ అంజయ్య, ఈఈలు, డీఈలు, ఏఈలు కేఎల్‌ఐ మొదటి లిఫ్ట్‌ను పరిశీలించారు. బెంగళూర్‌ నుంచి ఎన్‌ఐఆర్‌ఎంకు ప్రతినిధులను పిలిపించారు. వారు టన్నెల్‌ పనుల్లో బ్లాస్టింగ్‌ చేయించి ప్రత్యేక పరికరం ద్వారా కేఎల్‌ఐ లిఫ్ట్‌లో వచ్చే తీవ్రతను పరీక్షించారు. కానీ పెద్దగా ప్రమాదం లేదని తేల్చి చెప్పారు.