నేడు నిజామాబాద్‌ ఎమ్మెల్సీ పోలింగ్శాసన మండలి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక శుక్రవారం జరగనుంది. ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. స్థానిక సంస్థల్లో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఫలితాలు ఏకపక్షంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప.. ఈ ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే ఎక్కువ ఓటర్లు ఉండటంతో పాటు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ప్రజాప్రతినిధుల చేరికలతో ఆ పార్టీ జోరు మీద ఉంది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో ఇటీవల పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరికలు జరిగాయి. మరోవైపు వలసలతో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు కుదేలయ్యాయి. దీంతో ఈ రెండు జాతీయ పార్టీలు డిపాజిట్లు దక్కించుకోవడం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా వి.సుభాష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పోతనకర్‌ లక్ష్మీనారాయణలు బరిలో ఉన్నారు.