ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే టాప్‌ సీడ్‌ నిష్క్రమణ


పలువురు స్టార్‌ క్రీడాకారిణుల గైర్హాజరీలో కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించేందుకు వచ్చిన సదవకాశాన్ని టాప్‌ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) చేజార్చుకుంది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీలో ఈ మాజీ చాంపియన్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే నిష్క్రమించి ఆశ్చర్యపరిచింది. పోలాండ్‌ టీనేజర్‌ ఇగా స్వియాటెక్‌ కేవలం 68 నిమిషాల్లో 6–1, 6–2తో హలెప్‌ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించింది. గత ఏడాది ఇదే టోర్నీలో హలెప్‌తో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో స్వియాటెక్‌ 1–6, 0–6తో ఓడిపోయింది. ఏడాది తిరిగేలోపు అదే వేదికపై, ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే హలెప్‌ను స్వియాటెక్‌ చిత్తు చేయడం విశేషం. ఈ గెలుపుతో 19 ఏళ్ల స్వియాటెక్‌ తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. స్వియాటెక్‌తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో హలెప్‌ ఒక్కసారి కూడా బ్రేక్‌ పాయింట్‌ అవకాశాన్ని సంపాదించకపోవడం గమనార్హం. మరోవైపు స్వియాటెక్‌ నాలుగుసార్లు హలెప్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసింది.