తెరుచుకోని సినిమా హాళ్లు  కోవిడ్‌ లాక్‌డౌన్‌తో మూతపడ్డ సినిమా థియేటర్లను ఈనెల 15 నుంచి పలు నిబంధనలతో తెరుచుకోవచ్చని కేంద్రం ఆదేశాలు ఇచ్చినా, రాష్ట్రంలో మాత్రం తెరుచుకోలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. దీనికి తోడు తమ సమస్యలు తీర్చాకే థియేటర్లు ఓపెన్‌ చేయాలని సినీ ఎగ్జిబిటర్స్‌ నిర్ణయించారు. ఇందులో లాక్‌డౌన్‌ సమయంలో విద్యుత్‌ బిల్లుల చెల్లింపు వాయిదాతో పాటు థియేటర్‌ నిర్వహణ చార్జీల పెంపు, సింగిల్‌ థియేటర్‌లలో పార్కింగ్‌ ఫీజు వసూలు చేసుకునే అనుమతులు ఇవ్వాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచారు. ఈ మూడు అంశాలపై స్పష్టత వచ్చాకే ముందుకు వెళ్లాలని తెలంగాణ సినీ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే కర్ణాటక, గుజరాత్, బెంగాల్, యూపీ, బిహార్, ఢిల్లీ తదితర 14 రాష్ట్రాల్లో గురువారం నుంచి థియేటర్లు ప్రారంభించారు. ఈ విషయమై తెలంగాణ సినిమా ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి గోవింద్‌రాజ్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ, వీలైనంత త్వరగా తమ ప్రతిపాదనలపై ప్రభుత్వం స్పందిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.