కోవిడ్–19 కారణంగా సెంటిమెంట్ పడిపోవడం, లాక్‌డౌన్‌తో తిరోగమనం చవిచూసిన స్మార్ట్‌ఫోన్ విక్రయాలు తిరిగి గాడినపడ్డాయి. గతేడాదితో పోలిస్తే సెప్టెంబరులో ఆఫ్‌లైన్‌లో 10 శాతం వృద్ధి నమోదైందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ధర వ్యత్యాసం లేకపోవడంతో ఆన్లైన్ కస్టమర్లు కొంత ఆఫ్‌లైన్‌కు మళ్లడం.. మల్టీ బ్రాండ్ రిటైల్ చైన్లు గంటల వ్యవధిలోనే ఫోన్లను డెలివరీ చేస్తుండడమే ఈ వృద్ధికి కారణమని అవి అంటున్నాయి. 2019తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్–జూన్‌లో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు దేశవ్యాప్తంగా 51 శాతం తగ్గి 1.8 కోట్ల యూనిట్లకు పరిమితమైంది. జూలై నుంచి సేల్స్ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. పాఠశాలలు ఆన్లైన్ తరగతులకు మళ్లడం కూడా స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో కదలికకు కారణమైంది.