రీమేక్‌లో టబు పాత్రలో ఐశ్వర్య..  బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘అంధధూన్’‌ తమిళ రీమేక్‌లో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో అయుష్మాన్‌ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేస్తున్నట్లు సినీయర్‌ హీరో ప్రశాంత్‌ తండ్రి, నిర్మాత తియగరాజన్‌ తెలిపారు. ఈ రీమేక్‌లో ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ నటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే బాలీవుడ్‌లో‌ బ్లక్‌‌బస్టర్‌గా నిలిచిన ‘అంధధూన్’‌లో టబు కీలక పాత్ర పోషించారు. దీంతో తమిళ రిమేక్‌కు టబు పాత్రకు గాను ఐశ్వర్యరాయ్‌ను సంప్రదించినట్లు నిర్మాత తియగరాజన్‌ చెప్పారు. ఆయన ఓ జాతీయా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో టబు పాత్ర కోసం ఐశ్వర్యరాయ్‌తో చర్చలు జరుపుతున్నాం. అయితే ఇప్పటి వరకు తన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఒకవేళ తను ఓకే చెబితే మాత్రం దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రశాంత్‌, ఐశ్వర్యలు కలిసి పని చేస్తారు’ అంటూ చెప్పకోచ్చారు.