ఇలవేనిల్‌ పసిడి గురి

 


 షేక్‌ రసెల్‌ అంతర్జాతీయ ఎయిర్‌ రైఫిల్‌ ఆన్‌లైన్‌ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు మెరిశారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగం ప్రపంచ నంబర్‌వన్‌ ఇలవేనిల్‌ వలరివన్‌ పసిడి పతకం నెగ్గగా... పురుషుల విభాగంలో తుషార్‌ మానే రజతం దక్కించుకున్నాడు. ఇలవేనిల్‌ 627.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. 1000 డాలర్ల (రూ. 73 వేలు) ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. షియోరి హిరాట (జపాన్‌) రెండో స్థానంలో... విద్య తోయిబా (ఇండోనేసియా) మూడో స్థానంలో నిలిచారు. పురుషుల విభాగంలో జపాన్‌ షూటర్‌ నయోయ ఒకాడ 630.9 పాయింట్లతో బంగారు పతకాన్ని గెల్చుకోగా... తుషార్‌ 623.8 పాయింట్లు సాధించి రెండో స్థానాన్ని పొందాడు. తుషార్‌కు 700 డాలర్లు (రూ. 51 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. అబ్దుల్లా (బంగ్లాదేశ్‌) మూడో స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్‌ షూటింగ్‌ స్పోర్ట్‌ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరిగింది.