రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ, మావోయిస్టుల కార్యకలాపాలు, నేరాలు – నివారణ... తదితర అంశాలపై నేడు సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. శాంతిభద్రతల విషయంలో రాష్ట్రం లో పరిస్థితులు అంతటా అదుపులోనే ఉన్నాయి. కానీ, కొంతకాలంగా మావోయిస్టుల కార్యకలాపాలు మెల్లిగా ఊపందుకుంటున్నాయి. లాక్డౌన్ అనంతరం రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు పెరిగాయి. ఈ సమయంలో నెట్వర్క్ పెంచుకోవడం, రిక్రూట్మెంట్, చందాల వసూలు, షెల్టర్జోన్స్ ఏర్పాటు తదితర విషయాల్లో మావోయిస్టులు కాస్త పట్టు సాధించగలిగారు. లాక్డౌన్ ఎత్తివేశాక పలుమార్లు మావోలు– పోలీసులు పరస్పరం తారసపడి కాల్పులు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ తొలిరెండు వారాల్లో నాలుగు ఎన్కౌంటర్లు జరగడం, ఎనిమిది మంది మావోలు మృతిచెందడం రాష్ట్రంలో తిరిగి మావోల ఉనికిని చాటిచెప్పింది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ అనంతరం మావోయిస్టులు ఆసిఫాబాద్, ములుగు, భద్రాచలం తదితర జిల్లాల మీదుగా రాష్ట్రంలోకి ఎలా ప్రవేశించారన్న విషయం, వారిని నిలువరించేందుకు తీసుకున్న చర్యలు, వ్యూహాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు డీజీపీ వివరించనున్నారు. సీఆర్పీఎఫ్ కోబ్రా తదితర దళాలతో కలిసి ఏజెన్సీ ఏరియాల్లో సంయుక్తంగా చేపడుతున్న ఆపరేషన్లు, వినియోగిస్తోన్న ఆధునిక సాంకేతికతలపై సీఎంకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశముందని సమాచారం.